ఇంత త్వరగా వెళ్లిపోయావా?: సైమండ్స్ మరణంపై హర్భజన్ విచారం

  • సైమండ్స్ కుటుంబానికి సానుభూతి
  • అతడి మరణం దిగ్ర్భాంతికి గురిచేసిందన్న భజ్జీ
  • ఇద్దరి మధ్యా మంకీగేట్ గొడవ
  • ఆ తర్వాత మంచి స్నేహితులైన క్రికెటర్లు
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మరణంపై హర్భజన్ విచారం వ్యక్తం చేశాడు. అతడి మరణంపై సంతాపం తెలియజేశాడు. ‘‘సైమండ్స్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా వెళ్లిపోయావా? అతడి కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నా. సైమండ్స్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్ చేశాడు.

సైమండ్స్ , హర్భజన్ మధ్య జరిగిన గొడవ ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో తెలిసిందే. ‘మంకీ గేట్’ కుంభకోణంగా చరిత్రలో నిలిచిపోయింది. 2008లో భారత్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. ఆ సిరీస్ లో రెండో టెస్టు మ్యాచ్ సందర్బంగా సైమండ్స్, భజ్జీలు గొడవకు దిగారు. హర్భజన్ సింగ్ తనను ‘కోతి’ అని పిలిచాడని, జాతి వివక్ష కామెంట్లతో దూషించాడని సైమండ్స్ చెప్పుకొచ్చాడు. అయితే, వాస్తవానికి భజ్జీ హిందీలో తిట్టాడని, కోతి అనలేదని తర్వాత విచారణలో తెలిసింది.

అది అక్కడితో ఆగిపోలేదు. భజ్జీపై ఐసీసీ మూడు మ్యాచ్ ల నిషేధం విధించడంతో టీమిండియా ఎదురు తిరిగింది. టూర్ ను రద్దు చేసుకునేందుకూ వెనుకాడలేదు. దీంతో ఆ నిషేధాన్ని ఐసీసీ ఎత్తేసింది. అయితే, అదంతా గతం. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన భజ్జీ, సైమండ్స్ లు మంచి మిత్రులయ్యారు. పాత కలహాలు మనసును తొలిచేస్తున్నా అవన్నీ మరచిపోయి స్నేహితుల్లా ముందుకుసాగారు. 

అయితే, సైమండ్స్ మరణం ఇంత హఠాత్తుగా సంభవించడంతో ఒక్క భజ్జీనే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ తింది.


More Telugu News