సీబీఐ దత్తపుత్రుడికి తెలిసింది ఇదే: నాదెండ్ల మనోహర్

  • నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే జగన్ కు తెలిసిన విద్య అన్న మనోహర్ 
  • పాలన చేతకాని జగన్ లో ఆందోళన మొదలయిందని వ్యాఖ్య 
  • మేనిఫెస్టోలోని అంశాల గురించి అడిగినా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే జగన్ కు తెలిసిన విద్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయని... దీంతో పరిపాలన చేతకాని జగన్ లో ఆందోళన మొదలయిందని చెప్పారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెడుతూ జగన్ నోటికొచ్చిన హామీలన్నింటినీ గుప్పించారని అన్నారు. మేనిఫెస్టోలోని అంశాల గురించి అడిగినా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

95 శాతం హామీలను నెరవేర్చామని జగన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న ఎన్నో కుటుంబాలను ఆ పథకానికి ఎందుకు దూరం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల సంఖ్యను ఎందుకు తగ్గించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేపల చెరువులకు జీవో 217 ద్వారా మత్స్యకారులను ఎందుకు దూరం పెట్టారో జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మహాదాత మల్లాడి సత్యం పేరు పలికే అర్హత కూడా సీబీఐ దత్తపుత్రుడు జగన్ కు లేదని... సత్యం దానం చేసిన ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని మనోహర్ అన్నారు. నిరుద్యోగులను జగన్ మోసం చేశారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని జగన్ మోసం చేశారని అన్నారు. వైసీపీ దారుణ పాలన చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి గురించి ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని అన్నారు.


More Telugu News