చెన్నై కెప్టెన్సీకి సరైనోడు.. రుతురాజ్: సెహ్వాగ్

  • ధోనీ మాదిరే అతడు కూడా చాలా కూల్ అన్న సెహ్వాగ్ 
  • సెంచరీ చేసినా.. సున్నా చేసినా ఒకే రకంగా కనిపిస్తాడని కితాబు 
  • కెప్టెన్సీ గురించి తెలిసిన వాడని ప్రశంస 
  • ఒక్క అదృష్టం విషయమే తనకు తెలియదని కామెంట్ 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ వారసుడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ధోనీ వారసుడిగా నిలబడతాడని భావించిన రవీంద్ర జడేజా పూర్తిగా వైలఫ్యం కావడంతో.. మళ్లీ తాత్కాలికంగా ధోనీయే ఆ బాధ్యతలను భుజాలపైకి ఎత్తుకోవడం తెలిసిందే. ఆ తర్వాత జడేజా (గాయం కారణం చెప్పి) చెన్నై జట్టుకు దూరమయ్యాడు. 

ధోనీ వయసు 40 దాటాయి. వచ్చే సీజన్ కు 41కి చేరతాడు. ఆ తర్వాత సీజన్ కు అయినా కెప్టెన్ గా మరో వ్యక్తి రంగంలోకి దిగక తప్పదు. ధోనీ ఈ వయసులో ఎల్లకాలం సేవలు అందించలేడుగా..? ఈ క్రమంలో ధోనీ లక్షణాలనే కలిగి ఉన్న వ్యక్తిని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. అతడు ఎవరో కాదు.. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సీజన్ లో  గైక్వాడ్ ఫామ్ లో లేకపోవడం కూడా చెన్నై విజయ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పుకోవాలి. అయితే గైక్వాడ్ లో ఒక్కటి తప్ప, ధోనీలోని అన్ని లక్షణాలూ ఉన్నాయని సెహ్వాగ్ అన్నాడు.

‘‘మహారాష్ట్ర కెప్టెన్ గా పనిచేశాడు. చాలా కామ్ గా ఆడతాడు. సెంచరీ చేసినా పొంగిపోడు. సున్నా చేసినా అతడు ఒకే మాదిరిగా ఉంటాడు. వంద చేస్తే సంతోషం, సున్నా చేస్తే బాధ ముఖంలో కనిపించనీయడు. అతడు నియంత్రణ కలిగిన వ్యక్తి. మంచి కెప్టెన్ అయ్యేందుకు అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నందున.. మ్యాచ్ ను ఎలా శాసించాలి, ఎవరికి బాల్ ఇవ్వాలి, బ్యాటింగ్ ఆర్డర్ లో చేయాల్సిన మార్పులు ఏవి? అన్న వాటిపై అవగాహన ఉంది’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

మరో మూడు నాలుగు సీజన్లు ఆడితే గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇవ్వొచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఎంఎస్ ధోనీ గొప్ప కెప్టెన్ ఎందుకు అయ్యాడు? అతడు ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుని, బౌలర్లు, బ్యాటర్ల సేవలను చక్కగా ఉపయోగించుకుంటాడు. అతడికి అదృష్టం కూడా ఉంది. ఇవన్నీ గైక్వాడ్ లోనూ ఉన్నాయి’’ అని సెహ్వాగ్ అన్నాడు. అయితే గైక్వాడ్ లో లేని ఆ ఒక్క లక్షణం ఏంటని? ప్రశ్నించగా.. కచ్చితంగా చెప్పలేను కానీ, అది అదృష్టం కావచ్చన్నారు.


More Telugu News