థామస్ కప్‌లో భారత్ సంచలనం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు

  • డెన్మార్క్‌ను 3-2తో చిత్తు చేసిన భారత్ షట్లర్లు
  • రాస్మస్‌ను ఓడించి జట్టును ఫైనల్‌కు చేర్చిన ప్రణయ్
  • రేపటి ఫైనల్‌లో 14సార్లు విజేత అయిన ఇండోనేషియాను ఢీకొట్టనున్న భారత్
బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ కప్‌లో భారత్ సంచలనం సృష్టించింది. ఇండియన్ షట్లర్లు అద్భుత ప్రదర్శనతో పతకం ఖాయం చేసుకున్నారు. నిన్న జరిగిన సెమీ ఫైనల్‌లో డెన్మార్క్‌ను 3-2తో మట్టి కరిపించిన భారత జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. ఫలితంగా 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 

1979 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు సెమీస్‌కు కూడా చేరలేదు. ఈసారి ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈసారి కూడా హెచ్ఎస్ ప్రణయ్ మ్యాచ్ కీలకంగా మారింది. రాస్మస్ గెంకేను 13-21, 21-9, 21-12తో ప్రణయ్ చిత్తు చేశాడు. ఆదివారం జరగనున్న స్వర్ణ పతక పోరులో డిఫెండింగ్ చాంపియన్, 14సార్లు విజేత అయిన ఇండోనేషియాతో భారత్ తలపడుతుంది.

నిజానికి భారత్ తన సెమీస్ పోరును ఓటమితోనే ప్రారంభించింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో 13-21, 13-21తో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్ పోరులో సాత్విక్-చిరాగ్ జోడి కిమ్-మథియస్‌పై 21-18, 21-21, 22-20తో విజయం సాధించి భారత్‌ను తిరిగి రేసులో నిలబెట్టారు. ఆ తర్వాత జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్‌సెన్‌పై వరల్డ్ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ 21-18, 12-21, 21-15తో విజయం సాధించడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

అయితే, ఆ తర్వాత జరిగిన మరో డబుల్స్ పోటీలో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ రస్ముసెన్-సోగార్డ్ చేతిలో 14-21, 13-21తో ఓటమి పాలు కావడంతో ఓవరాల్ స్కోర్లు 2-2తో సమమయ్యాయి. అనంతరం జరిగిన సింగిల్స్‌లో ప్రణయ్ విజయం సాధించడంతో భారత్ 3-2తో ఫైనల్‌లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.


More Telugu News