యుద్ధం ముగియ‌కున్నా... 18న కీవ్‌లో భార‌త ఎంబ‌సీ పునఃప్రారంభం

  • మార్చి 13న కీవ్ నుంచి భార‌త ఎంబ‌సీ వార్సాకు త‌ర‌లింపు
  • ఇప్ప‌టికీ కీవ్‌ను స్వాధీనం చేసుకోలేక‌పోయిన ర‌ష్యా
  • కీవ్ కేంద్రంగా రాయ‌బార కార్య‌కలాపాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు దేశాల ఆసక్తి
  • అదే బాట‌లో సాగుతున్న భార‌త్‌
ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ర‌ష్యా బాంబు దాడుల‌తో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ స‌హా ఆ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నీ పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. యుద్ధానికి ర‌ష్యా ఎప్పుడు ముగింపు ప‌లుకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో భార‌త విదేశాంగ శాఖ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల 18న కీవ్‌లో భార‌త ఎంబ‌సీని పునఃప్రారంభించాల‌ని భార‌త విదేశాంగ శాఖ నిర్ణ‌యించింది. 

ఇదిలా ఉంటే..రెండు నెల‌లుగా ఉక్రెయిన్‌పై బాంబు దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ర‌ష్యా ఇప్ప‌టిదాకా కీవ్‌ను స్వాధీనం చేసుకోలేక‌పోయింది. ఈ కార‌ణంగానే ఆ న‌గ‌రంపై బాంబుల మోత మోగించిన ర‌ష్యా...న‌గ‌రంలోని మెజారిటీ ప్రాంతాల్లో భవ‌నాల‌ను కూల్చేసింది. 

ర‌ష్యా యుద్ధం ప్రారంభించిన నేప‌థ్యంలో అప్ప‌టిదాకా కీవ్ కేంద్రంగా కొన‌సాగుతున్న ఉక్రెయిన్‌లోని భార‌త ఎంబ‌సీని మార్చి 13న‌ పోలండ్ రాజ‌ధాని వార్సాకు భార‌త్ త‌ర‌లించింది. అయితే ఇప్పుడు చాలా దేశాలు కీవ్ నుంచే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే దిశ‌గా సాగుతున్న నేప‌థ్యంలో భార‌త్ కూడా కీవ్‌లో త‌న ఎంబ‌సీని ఈ నెల 18న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది.


More Telugu News