వికెట్ల మధ్య ఏమిటా వేగం.. ధోనీ కెప్టెన్ గా కొనసాగొచ్చు: మాథ్యూ హేడెన్

  • సాధారణ అథ్లెట్ వయసును దాటేసిన ధోనీ అన్న హేడెన్ 
  • అసాధారణ పనితీరు చూపిస్తున్న ధోనీ అంటూ ప్రశంసలు 
  • అతడు నాయకుడుగా ఉండడం సీఎస్కేకు మంచిదేనన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 40 ఏళ్ల వయసులోనూ చూపిస్తున్న చురుకుదనం అభిమానులు, సీనియర్ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబైతో గురువారం నాటి మ్యాచ్ లో ధోనీ జింకపిల్ల మాదిరిగా వికెట్ల మధ్య పరుగెత్తిన విధానం నిజంగా ప్రశంసనీయం. జట్టులో ధోనీ తప్ప ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. ఎంతో అనుభవం ఉన్న ధోనీ మాత్రం 33 బంతులను ఎదుర్కొని 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు సిక్స్ లు, నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. స్ట్రయిక్ రేటు 109గా ఉంది.

దీనిపై సీఎస్కే మాజీ సభ్యుడు, ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మాథ్యూ హేడెన్ స్పందించారు. చెన్నై జట్టుకు నాలుగు సార్లు టైటిల్ సాధించిన పెట్టిన ధోనీ కావాలనుకుంటే భవిష్యత్తులోనూ ఐపీఎల్ లో కొనసాగొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

‘‘వికెట్ల మధ్య అతడి వేగం అసాధారణం. సాధారణ అథ్లెట్ వయసు దాటిన వ్యక్తి నుంచి ఈ స్థాయి పోటీ నిజంగా మంచిది. అతడు ఆటను కొనసాగించాలని అనుకుంటే అదే చేయొచ్చు. అతడు జట్టు కోసం పాటు పడుతున్నాడు. ధోనీ లాంటి వ్యక్తి ఉండడం, అతడి చుట్టూ జట్టు నిర్మాణం అయిన తీరు సీఎస్కేకు అవసరమే. ఎంఎస్ ధోనీ వంటి వ్యక్తిని కలిగి ఉండడం నాయకత్వం పరంగా ముఖ్యమైనది’’ అని హేడెన్ చెప్పాడు. 



More Telugu News