మహేశ్ బాబు అన్నది నిజమే: హీరోయిన్ కంగ‌న సమర్ధన

మహేశ్ బాబు అన్నది నిజమే: హీరోయిన్ కంగ‌న సమర్ధన
  • మ‌హేశ్‌ను బాలీవుడ్ భ‌రించ‌లేద‌న్న కంగ‌న‌
  • ఆయనను బాలీవుడ్ నుంచి ఎంతోమంది సంప్రదించారని వ్యాఖ్య‌
  • ప్రస్తుతం టాలీవుడ్‌ దేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రీ అని ప్ర‌శంస‌
  • మ‌హేశ్ బాబుకు త‌గ్గ రెమ్యూనరేషన్ బాలీవుడ్ ఇవ్వలేదన్న హీరోయిన్
'స‌ర్కారు వారి పాట' సినిమా ప్ర‌చారంలో ఇటీవ‌ల హీరో మ‌హేశ్ బాబు మాట్లాడుతూ బాలీవుడ్ త‌న‌ను భ‌రించ‌లేద‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌లు బాలీవుడ్ లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైన నేప‌థ్యంలో ఈ విష‌యంపై హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ స్పందించింది. కంగన నటించిన చిత్రం ‘ధాకడ్’ ప్ర‌చార కార్యక్రమంలో కంగన మాట్లాడుతూ.. మహేశ్ బాబు అన్నది నిజమేన‌ని, ఆయనను బాలీవుడ్ భ‌రించ‌లేద‌ని చెప్పింది. 

ఎందుకంటే ఆయనను బాలీవుడ్ నుంచి ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని త‌నకు తెలుసని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ, ప్రస్తుతం టాలీవుడ్‌ దేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా నిలిచిందని, దీంతో మ‌హేశ్ బాబుకు త‌గ్గ రెమ్యూనరేషన్ బాలీవుడ్ క‌చ్చితంగా ఇవ్వలేదని చెప్పింది. మ‌హేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకుని, చిన్న చిన్న విషయాలను ఎందుకు వివాదాస్ప‌దం చేస్తున్నారో త‌నకు అర్థం కావ‌ట్లేద‌ని పేర్కొంది. 

టాలీవుడ్ పైనా, తన పనిపైనా మ‌హేశ్ బాబు గౌరవం చూపడం వల్లనే ఆయ‌న‌ ఈ స్థాయిలో ఉండగలిగాడని తెలిపింది. ఆ విష‌యాన్ని అంద‌రూ అంగీక‌రించాల‌ని చెప్పింది. టాలీవుడ్‌ గత 10, 15 ఏళ్లలో తమిళ సినీ పరిశ్రమతో పాటు ఇతర ఇండస్ట్రీలన్నింటినీ అధిగమించి దూసుకెళ్తుంద‌ని చెప్పింది. టాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకోవాలని తెలిపింది.


More Telugu News