ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా సౌదీ ఆరాంకో

  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • భారీగా పెరిగిన చమురు ధరలు
  • విపరీతంగా లాభపడిన సౌదీ ఆరాంకో షేర్లు
  • 2.43 ట్రిలియన్ డాలర్లకు పెరిగిన సంపద
  • తగ్గిన ఆపిల్ షేర్ విలువ
చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో షేరుకు రెక్కలొచ్చాయి. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సౌదీ ఆరాంకో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఆపిల్ సంస్థ షేర్లు పతనం కావడంతో సౌదీ నెంబర్ వన్ స్థానానికి చేరింది. ప్రస్తుతం సౌదీ ఆరాంకో సంపద 2.43 ట్రిలియన్ డాలర్లు కాగా, ఆపిల్ సంపద 2.37 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఇతర అంతర్జాతీయ పరిణామాలతో చమురు ధరల్లో విపరీతమైన పెరుగుదల ఏర్పడింది. ఈ ఏడాది ఆరంభంలో ఆపిల్ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుని, ఆ ఘనత అందుకున్న తొలి కంపెనీగా చరిత్ర సృష్టించింది. 

ఇక, గతంలో ఓ మోస్తరు కంపెనీగా ఉన్న సౌదీ ఆరాంకో 2019లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లాక సంస్థకు దశ తిరిగిపోయింది. ఆ కంపెనీ సంపద ఒక్కసారిగా 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 

ఈ ఏడాది ఆరంభంలో రష్యా... ఉక్రెయిన్ దండయాత్రకు దిగడంతో ఆ ప్రభావం చమురు రంగంపైనా పడింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతికి ఆంక్షలు అడ్డొచ్చాయి. దాంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. క్రూడాయిల్ ధరలు 36 శాతం పెరిగాయి. సింగిల్ బ్యారెల్ ధర 106.2 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో సౌదీ ఆరాంకో షేర్ల విలువ 27 శాతం శాతానికి ఎగిసింది. అదే సమయంలో జనవరి నుంచి ఆపిల్ సంస్థ షేర్ల విలువలో 17 శాతం క్షీణత నమోదైంది.


More Telugu News