శ్రీలంక నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే... అన్నీ సవాళ్లే!

  • శ్రీలంకలో తీవ్రస్థాయిలో నిరసన జ్వాలలు
  • లంక రాజకీయాల్లో కీలకమార్పులు 
  • ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
  • కొత్తగా ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
నిరసన జ్వాలల్లో భగ్గుమంటున్న శ్రీలంకలో గత కొన్నిరోజులుగా కీలక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగారు. ఇప్పుడు నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. ఆయన ఈ సాయంత్రం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. 

దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటినుంచి రణిల్ విక్రమసింఘే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కొత్త ప్రధాని రేసులో ఆయనే ముందున్నారు. గతంలోనూ అనేక పర్యాయాలు ప్రధానిగా వ్యవహరించిన రణిల్ విక్రమ సింఘే ఆరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆయన సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీలో హర్షం వ్యక్తమైంది. 

యునైటెడ్ నేషనల్ పార్టీ చైర్మన్ వజిర అబేవర్ధనే దీనిపై స్పందిస్తూ, రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్దతు సాధిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. 

అయితే, శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోవడం, వాణిజ్యం దారుణంగా పడిపోవడం, నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో కొత్తగా ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News