వివేకా హ‌త్య కేసు నిందితుల బెయిల్‌పై హైకోర్టు నిర్ణ‌యం వాయిదా

  • బెయిల్ కోరుతూ ముగ్గురు నిందితుల పిటిష‌న్‌
  • చార్జి షీటు దాఖ‌లైనందున బెయిల్ ఇవ్వాల‌న్న పిటిష‌న‌ర్లు
  • సాక్షులను ప్ర‌భావితం చేస్తార‌న్న సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది
  • త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుల బెయిల్‌పై నిర్ణ‌యాన్ని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డి, సునీల్ కుమార్ యాద‌వ్‌లు త‌మ‌కు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్ల‌పై ఇదివ‌రకే విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు గురువారం మ‌రోమారు విచారించింది.

ఈ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖ‌లు చేసింద‌ని, ఈ స‌మ‌యంలో నిందితుల‌కు బెయిల్ ఇస్తే కేసు ఎలాంటి ప్ర‌భావితం అయ్యే అవ‌కాశాలు లేవ‌ని పిటిష‌న‌ర్ల త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అయితే నిందితుల‌కు బెయిల్ ఇస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌మాదం ఉంద‌ని సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. 

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న కోర్టు... కేసు ద‌ర్యాప్తున‌కు ఇంకెంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌శ్నించింది. ద‌ర్యాప్తు అధికారుల‌ను అడిగి వివ‌రాల‌ను కోర్టుకు తెలియ‌జేస్తామ‌ని సీబీఐ లాయ‌ర్ కోర్టుకు విన్న‌వించారు. దీంతో నిందితుల బెయిల్‌పై నిర్ణ‌యాన్ని కోర్టు వ‌చ్చే గురువారానికి వాయిదా వేసింది.


More Telugu News