కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండేళ్లయినా, వీడని ఆరోగ్య సమస్యలు.. చైనా అధ్యయనంలో వెల్లడి

కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండేళ్లయినా, వీడని ఆరోగ్య సమస్యలు.. చైనా అధ్యయనంలో వెల్లడి
  • ఇప్పటికీ వేధిస్తున్న లాంగ్ కొవిడ్ అనారోగ్యం
  • 55 శాతం మందికి కనీసం ఒక సమస్య
  • ఎక్కువ మందిలో అలసట
  • సాధారణ జీవితానికి రెండేళ్ల వ్యవధి
  • లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వివరాలు
కరోనా వైరస్ తో దీర్ఘకాలం పాటు చికిత్స పొందిన వారు.. రెండేళ్లు అయినా ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. చైనాలో జరిగిన అతిపెద్ద ఫాలో అప్ స్టడీ వివరాలు లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారిని ఏదో ఒక లక్షణం ఇప్పటికీ వేధిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 

కరోనా వైరస్ మొదటి దశలో కరోనా బారిన పడ్డ 1,192 మందిపై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి పలు విషయాలను పరిశోధకులు తెలుసుకున్నారు. కొంత కాలానికి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతున్నా.. సాధారణ ప్రజలతో పోలిస్తే ఆరోగ్యం, నాణ్యమైన జీవనం విషయంలో కరోనా బాధితులు వెనుకనే ఉన్నట్టు చెబుతున్నారు.

కరోనా బారిన పడిన ఆరు నెలల తర్వాత 68 శాతం మంది బాధితులు ఒక్కటైనా లాంగ్ కొవిడ్ లక్షణం ఉన్నట్టు చెప్పారు. రెండేళ్ల తర్వాత వారిని విచారించగా.. ఇప్పటికీ ఒక్క లక్షణంతో బాధపడుతున్నట్టు 55 శాతం మంది చెప్పడం గమనార్హం. 

అలసట లేదా కండరాల బలహీనతతో బాధపడుతున్నామని ఆరు నెలల తర్వాత 52 శాతం మంది చెప్పారు. అదే రెండేళ్ల తర్వాత అడగ్గా.. ఈ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పిన వారు 30 శాతంగానే ఉన్నారు. కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారన్న దానితో సంబంధం లేకుండా రెండేళ్లకు వారు తిరిగి పూర్వపు జీవితానికి వచ్చేశారు.

రెండేళ్ల తర్వాత కూడా అలసట లేదా కండరాల బలహీనతను 30 శాతం మంది, నిద్రపరమైన సమస్యలను 31 శాతం మంది ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా బారిన పడని వారితో పోలిస్తే.. కరోనాను ఎదుర్కొన్న వారు కీళ్ల నొప్పులు, పాల్పిటేషన్స్ (గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు), తల తిరగడం, తలనొప్పి సమస్యలు ఉన్నట్లు చెప్పారు.


More Telugu News