పసి హృదయాల్లో కులం చిచ్చు.. ఆరో తరగతి విద్యార్థిని నిప్పుల్లోకి తోసేసిన తోటి విద్యార్థులు

  • తమిళనాడులోని తిండివనంలో ఘటన
  • నానమ్మ ఇంటికి వెళుతున్న బాలుడిపై దాడి 
  • ముగ్గురు బాలురపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కులం చిచ్చు పసి హృదయాల్లోనూ నిప్పులు రాజేస్తోంది. అందుకు తమిళనాడులో జరిగిన దారుణ ఘటనే నిదర్శనం. 11 ఏళ్ల బాలుడిని అతడు చదివే స్కూల్లోనే చదువుతున్న తన తోటి విద్యార్థులు కులం పేరుతో దూషించి నిప్పుల్లోకి తోసేశారు. విల్లుపురం జిల్లాలోని దిండివనంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అగ్రవర్ణ బాలురపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత బాలుడు దిండివనంలోని కట్టుచివ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్టు పోలీసులు చెప్పారు. అదే స్కూల్ లో నిందిత బాలురూ చదువుతున్నారు. 

అసలేం జరిగిందంటే... 

నాయనమ్మ ఇంటికి వెళ్లివస్తానంటూ బాధిత బాలుడు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, కాసేపటికి అతడు ఒంటి నిండా గాయాలతో ఇంటికి చేరాడు. ఏమైందని అమ్మ అడిగితే.. నిప్పులంటుకున్న ముళ్ల పొదల్లో పడ్డానని ఆ బాలుడు చెప్పాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 

అయితే, అసలేం జరిగిందో చెప్పాలంటూ మరోసారి అడగ్గా.. జరిగిన విషయం చెప్పాడు. తన స్కూల్ లో తనతో పాటు చదివే కొందరు అగ్రవర్ణ విద్యార్థులు కులం పేరుతో తిట్టారని వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాను ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు మరోసారి తిట్టి కొట్టారని, నిప్పుల్లోకి తోసేశారని వివరించాడు. 

చొక్కాకు మంటలు అంటుకోవడంతో వెంటనే చెరువులోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బాధిత బాలుడి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు బాలురపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు.


More Telugu News