పర్యావరణ మార్పుల ఎఫెక్ట్​: హిమనీనదం కరిగి.. వరద పెరిగి.. కూలిపోయిన బ్రిడ్జి.. ఇదిగో వీడియో

  • పాకిస్థాన్ లోని గిల్గిత్ బాల్టిస్థాన్ లో ఘటన
  • కరిగిన షిష్పర్ గ్లేసియర్
  • వరద ధాటికి కుప్పకూలిన వంతెన
  • ఆ వీడియోను షేర్ చేసిన ఆ దేశ మంత్రి
పర్యావరణ మార్పులు, భూతాపం ఎంతటి ఎఫెక్ట్ పడుతుందో చెప్పే ఘటన ఇది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ఎంత ముఖ్యమే చెప్పే సంఘటన ఇది. అవును, పెరిగిపోతున్న భూతాపంతో హిమ పర్వతాలు కరిగిపోయి ఆ నీళ్లతో వరదలు ముంచెత్తుతున్నాయి. అలాంటి ఘటనే పాకిస్థాన్ లోని గిల్గిత్ బాల్టిస్థాన్ రీజియన్ లో జరిగింది. 

గత శనివారం మౌంట్ షిష్పర్ లోని షిష్పర్ గ్లేసియర్ (హిమనీనదం) కరిగిపోయి వరద ముంచెత్తింది. ఆ వరద ధాటికి కారాకోరం హైవేపై ఉన్న హసనబాద్ వంతెన కూలిపోయింది. భూతాపం వల్లే హిమనీ నదం కరిగిపోయి నీటి మట్టం పెరిగిపోయిందని నిపుణులు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ పర్యావరణ మార్పుల మంత్రి, సెనేటర్ షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. 

అత్యధిక ఉష్ణోగ్రతలతో పాకిస్థాన్ కు ముప్పు పొంచి ఉందని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించామని ఆమె గుర్తు చేశారు. హిమనీనదం కరగడం వల్ల వరద ముంచెత్తింది, ఆ వరద ధాటికి వంతెన పిల్లర్ల కింద మట్టి అంతా కొట్టుకుపోయిందని, ఫలితంగా వంతెన కూలిందని చెప్పారు. రెండు రోజుల్లో తాత్కాలిక వంతెనను నిర్మించనున్నట్టు వెల్లడించారు. 

ధ్రువ ప్రాంతాలను పక్కనపెడితే.. ప్రపంచంలోనే అత్యధిక హిమనీ నదాలు పాకిస్థాన్ లోనే ఎక్కువున్నాయని చెప్పారు. దేశ ఉత్తర ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలా వరకు మంచు కరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ నేతలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.


More Telugu News