‘అసని’ ఎఫెక్ట్: ఏపీ అంతటా కురుస్తున్న వర్షాలు.. మచిలీపట్నం, కోనసీమ, ఉప్పాడలో పెరిగిన సముద్ర అలల ఉద్ధృతి

  • రేపటికి వాయుగుండంగా బలహీనపడే చాన్స్
  • అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • కృష్ణా, కోనసీమ జిల్లాల్లో నేలకొరిగిన పంటలు
  • వరి, అరటి, బొప్పాయి, మామిడి రైతులకు నష్టం
  • అసని ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష 
తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ‘అసని’ మరింత బలహీన పడనుంది. రేపు ఉదయానికి వాయుగుండంగా మారనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను.. ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

కొన్ని గంటల్లో అది వాయవ్య దిశగా పయనించనుంది. నర్సాపురం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశాలున్నాయి. దాని ప్రభావంతో ఇవాళ కోస్తా ఆంధ్రా, రేపు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

కోస్తా తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ సముద్రంలో అలజడి పెరిగిపోయింది. ఐదు మీటర్ల కన్నా ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. అలలధాటికి మత్స్యకారుల పడవలు కొట్టుకుపోకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇటు ఉప్పాడ, కోనసీమలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. 

కాగా, కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలోని మలికిపురంలో అత్యధికంగా 4.96 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. డెల్టాలో 191 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటికే 80 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. 

కృష్ణా జిల్లా దివిసీమలో భారీ గాలులు వీస్తున్నాయి. మోపిదేవి, చందపల్లి మండలాల్లో అరటి, మునగ, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగాలులకు రోడ్డుపై తాటి సహా మహా వృక్షాలు విరిగిపడ్డాయి. 

కాగా, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉద్యానవన, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లాలో వర్షం కురుస్తోంది. ఇక, తుపాను ఎఫెక్ట్ తో విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

అసని ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.


More Telugu News