లౌడ్ స్పీకర్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం

  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న లౌడ్ స్పీకర్ల అంశం
  • ఇప్పటికే యూపీలో లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్న వైనం
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిన కర్ణాటక
లౌడ్ స్పీకర్ల అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ అంశం రాజకీయపరంగా వివాదాస్పదంగా మారింది. యూపీలో ఇప్పటికే వేలాది ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్ స్పీకర్లను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. లౌడ్ స్పీకర్లను తొలగించాల్సిందేనని, లేకపోతే లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను పఠిస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే వార్నింగ్ కూడా ఇచ్చారు. 

కర్ణాటకలో కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను నిషేధించింది. కమ్యూనిటీ హాల్స్, కాన్ఫరెన్స్ గదులు, ఆడిటోరియంలు, మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్ప ఇతర బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో శబ్ద తీవ్రత 10 డెసిబుల్స్ కి మించరాదనే సుప్రీంకోర్టు నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.


More Telugu News