రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా వచ్చాయి?: మధు యాష్కీ

  • కేసీఆర్ అంటేనే మోసం, దగా
  • కల్వకుంట్ల కుటుంబం ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం
  • రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ మేలుకుంది
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. కాంగ్రెస్ శ్రేణులు మళ్లీ క్రియాశీలకంగా మారేలా జీవం పోసింది. వరంగల్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర నేతలు సంతోషంగా ఉన్నారు. 

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ, వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్ ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయాలని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ పైనే చర్చ జరుగుతోందని అన్నారు. రాహుల్ సభ తర్వాత బీజేపీకి భయం పట్టుకుందని చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే మోసం, దగా అని మధు యాష్కీ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబమని దుయ్యబట్టారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని అన్నారు. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకు బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రూ. 884 కోట్ల ఫండ్ ఎలా వచ్చిందని అడిగారు. రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ మేలుకుందని, రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పారు.


More Telugu News