అమెరికాలో నల్గొండ జిల్లా వాసి దుర్మరణం.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి గల్లంతు

  • ఈ నెల 7న యూఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కిరణ్ రెడ్డి
  • జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతు
  • ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు
  • అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం చెందాడు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్‌రెడ్డి (25) వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 7న స్నేహితులతో కలిసి వెళ్తుండగా, వీరి కారును ఓ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మరో ఘటనలో తెలంగాణకే చెందిన కడారి అఖిల్ (25) జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు అఖిల్ 2018లో జర్మనీ వెళ్లాడు. ఈ నెల 8న ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత అఖిల్ కనిపించకుండా పోవడంతో అతని కోసం గాలిస్తున్నారు.

 మరోవైపు, తన సోదరుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలంటూ అఖిల్ సోదరి మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అఖిల్ గల్లంతు ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.


More Telugu News