దేశ రాజధానిలో త్వరలో ఇంటి వద్దకే మద్యం

  • పచ్చజెండా ఊపిన మంత్రుల సంఘం
  • త్వరలోనే కేబినెట్ ముందుకు ఫైలు
  • కొత్త మద్యం పాలసీకి కేజ్రీ సర్కారు కసరత్తులు
ఢిల్లీ మందుబాబులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. త్వరలోనే ఇంటి వద్దకే మద్యం అందించనుంది. ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు అధికారులు వెల్లడించారు. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తోంది. 

మద్యానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుండగా, పలు అక్రమాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ సర్కారు మద్యం ధరలపై 25 శాతం తగ్గింపు నిర్ణయించింది. 

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్ల వద్దకే మద్యం అందించే పథకం అమలు చేయనున్నారు. 

ఇంటి వద్దకే మద్యం సరఫరా బాధ్యతలను ఢిల్లీలోని రిటైల్ మద్యం విక్రయదారులకు అప్పగించాలని మంత్రుల సంఘం సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కరోనా మహమ్మారి వ్యాప్తి, ఇతర అత్యవసర సమయాల్లో ఇళ్ల వద్దకే మద్యం సరఫరా మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుందని మంత్రులు భావిస్తున్నారు.


More Telugu News