విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా?: సోమిరెడ్డి

  • నారాయణ అరెస్ట్
  • భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • రాజకీయ కుట్ర అని అచ్చెన్న వ్యాఖ్యలు
  • ఆషామాషీగా ఉందా అంటూ సోమిరెడ్డి ఆగ్రహం
టీడీపీ మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత నారాయణ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ అరెస్ట్ పై ప్రభుత్వం కారణం చెప్పే పరిస్థితి లేదని ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గంటగంటకు ఎఫ్ఐఆర్ మార్చుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆరోపించారు. 

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణ విద్యాసంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థల ద్వారా బోధన జరుగుతోందని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మందికి పైగా ఉద్యోగులతో నడుస్తున్న విద్యాసంస్థలు అని వివరించారు. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతలను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతలను నారాయణ పూర్తిగా వదిలేశారని సోమిరెడ్డి స్పష్టం చేశారు. 

విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజిపై విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు వైసీపీ ఇకనైనా స్వస్తి పలికాలని హితవు పలికారు.


More Telugu News