చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్: నారా లోకేశ్

  • రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగ‌మే నారాయ‌ణ అరెస్ట్‌ అన్న లోకేశ్ 
  • సూత్ర‌ధారులైన వైసీపీ నేత‌ల‌ను వ‌దిలేసి టీడీపీ నేత‌ల అరెస్ట్‌ అంటూ విమర్శ 
  • లీకేజీపై మంత్రి బొత్స‌, సీఎం జ‌గ‌న్ విరుద్ధ ప్ర‌క‌ట‌న‌ల‌న్న లోకేశ్
ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత‌ పొంగూరు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. త‌మ చేత‌గాని త‌నాన్ని ఇత‌రుల‌పైకి నెట్టేయ‌డం జ‌గ‌న్ అండ్ కో ట్రేడ్ మార్క్ అంటూ లోకేశ్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌రుస ట్వీట్ల‌లో జ‌గ‌న్ స‌ర్కారు తీరును త‌ప్పుబ‌ట్టారు. ఈ ట్వీట్లతో పాటు నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారన్న విషయాన్ని తెలుపుతూ లోకేశ్ ఓ ఫొటో కూడా పోస్ట్ చేశారు.


చేత‌గానిత‌నాన్ని ఇత‌రుల‌పైకి నెట్టేయ‌డ‌మే కాకుండా.. చేసిన నేరాలు, అక్ర‌మాల‌కు ఇత‌రుల్ని బాధ్యుల‌ను చేయ‌డం జ‌గ‌న్ అండ్ కో ట్రేడ్ మార్క్‌గా అభివ‌ర్ణించిన లోకేశ్... పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్ల‌ విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశార‌న్నారు. 

ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించిన లోకేశ్... సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల‌ అరెస్ట్‌తో సైకో ఆనందం పొందొచ్చేమో కానీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదంటూ లోకేశ్ తెలిపారు.


More Telugu News