శశిథరూర్ వర్సెస్ వివేక్ అగ్నిహోత్రి.. సునంద పుష్కర్ పాత ట్వీట్ ను ఎత్తి చూపిన వివేక్

శశిథరూర్ వర్సెస్ వివేక్ అగ్నిహోత్రి.. సునంద పుష్కర్ పాత ట్వీట్ ను ఎత్తి చూపిన వివేక్
  • సింగపూర్ లో కశ్మీర్ ఫైల్స్ సినిమా బ్యాన్
  • ఆ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన శశిథరూర్
  • అధికారపార్టీ ప్రమోట్ చేసిన సినిమా అంటూ కామెంట్
  • వేరే సినిమాలనూ బ్యాన్ చేసిందంటూ వివేక్ కౌంటర్
  • సునంద పుష్కర్ పాత ట్వీట్ తో బదులిచ్చిన డైరెక్టర్
ద కశ్మీర్ ఫైల్స్.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాపై మొదటి నుంచీ భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. సినీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఈ వివాదం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ , సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. 

కారణం.. సినిమాను సింగపూర్ నిషేధించడం దగ్గర మొదలైంది. సినిమాలో ముస్లింలను ఏకపక్షంగా విలన్లుగా చేసి చూపించారని పేర్కొంటూ ఆ దేశంలో సినిమా ప్రదర్శనపై నిషేధం విధించారు. ఈ విషయంపైనే శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘‘భారత అధికార పార్టీ ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను సింగపూర్ లో బ్యాన్ చేశారు’’ అంటూ ట్వీట్ చేశారు. 

అయితే, దానికి వెనువెంటనే వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్ కౌంటర్లు ఇచ్చారు. ‘‘మూర్ఖ శిఖామణి శశిథరూర్.. ప్రపంచంలోనే అత్యంత చెత్త సెన్సార్ అని సింగపూర్ కు పేరు. ద లాస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సినిమానూ ఆ దేశం బ్యాన్ చేసింది. కావాలంటే మీ మేడమ్ ను అడుగు. ద లీలా హోటల్ ఫైల్స్ అనే రొమాంటిక్ సినిమానూ నిషేధించింది. కశ్మీరీ హిందువుల ఊచకోతపై జోకులు వేయడం మానుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. 

ఆ తర్వాత మరికాసేపటికి.. కశ్మీరీ హిందువుల ఊచకోతపై మాట్లాడొద్దంటూ తన భర్త శశిథరూర్ తన నోరు మూయించారంటూ సునంద పుష్కర్ పాత ట్వీట్ ను పోస్ట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి.. ఇది నిజమేనా? అంటూ ప్రశ్నించారు. ‘‘సునంద పుష్కర్ కశ్మీరీ హిందువా? అదే నిజమైతే ఆమె ఆత్మ క్షోభించకముందే హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలనుకుంటే.. వెంటనే మీ ట్వీట్ ను తొలగించండి. సునందకు క్షమాపణ చెప్పండి’’ అంటూ మరో ట్వీట్ చేశారు. 

కశ్మీరీ హిందువుల ఊచకోత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం మంచిది కాదంటూ శశిథరూర్ కు అనుపమ్ ఖేర్ సూచించారు. కశ్మీరీ హిందువైన సునంద పుష్కర్ కోసమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, కశ్మీరీ పండిట్లపై కొంత సున్నితంగా ఉండాలంటూ సూచించారు. ఓ దేశం కశ్మీరీ ఫైల్స్ ను నిషేధిస్తే సంబరాలు చేసుకోవడం తగదన్నారు.   

కాగా, వారి వ్యాఖ్యలకు శశిథరూర్ వివరణ ఇచ్చారు. ఇంతవరకు తాను చూడని ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోని అంశాల గురించి తానేమీ మాట్లాడలేదని, కేవలం సినిమా బ్యాన్ చేశారన్న విషయాన్నే తాను పోస్ట్ చేశానని చెప్పారు. కశ్మీరీ పండిట్లను అవమానించలేదని, వారిపై జరిగిన దారుణాలను తక్కువ చేసి చూపలేదని అన్నారు. 

ఈ విషయంలోకి చనిపోయిన తన భార్యను లాగడం మంచిదికాదన్నారు. కశ్మీరీ హిందువులపై ఆమెకున్న అభిప్రాయాలేంటో తన కన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరూ లేరన్నారు. సొపోర్ లోని బొమైలో నాశనమైన తన పూర్వీకుల ఇంటిని తాను కూడా చూశానని చెప్పారు. ఆమె చనిపోయిందన్న విషయాన్ని పక్కనపెట్టి ఈ వ్యవహారంలోకి లాగి లబ్ధి పొందడం తగదన్నారు. ఆమె ఎప్పటికీ స్నేహపూర్వక రాజీనే నమ్ముతుందని, ద్వేషాన్ని కాదని చెప్పారు.


More Telugu News