రగులుతున్న శ్రీలంక.... నావికాదళ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స కుటుంబం!

  • శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం
  • చేతులెత్తేసిన ప్రభుత్వం
  • ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం
  • ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా
  • మరింత పేట్రేగిన హింస
పదవికి రాజీనామా చేసిన మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబం ఓ నావికాదళ స్థావరంలో తలదాచుకుంది. దేశంలో నిరసనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో, మాజీ ప్రధాని రాజపక్సతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓ హెలికాప్టర్ లో ట్రింకోమలీలోని ఓ నేవీ బేస్ కు తరలించారు. కాగా, రాజపక్స కుటుంబం ఆశ్రయం పొందుతున్న నేవీ స్థావరం ఎదుట కూడా నిరసనలు భగ్గుమంటున్నట్టు తెలిసింది. ఈ నావికాదళ స్థావరం రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

నిన్న కొలంబో వెలుపల ఆందోళనకారుల ఆగ్రహావేశాలకు గురైన అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరల భయంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. 

కాగా, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స తప్పుకున్న అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు గుమికూడారు. దాంతో అక్కడికి భారీ ఎత్తున భద్రతాబలగాలను తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు, హెచ్చరికగా పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో, సూర్యోదయానికి ముందే హెలికాప్టర్ లో మహింద రాజపక్స కుటుంబాన్ని తరలించారు. 

1948లో స్వాతంత్ర్యం పొందాక శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. ప్రస్తుతం శ్రీలంకలో ప్రభుత్వం దాదాపు పతనావస్థకు చేరుకున్నట్టే భావించాలి. అయితే, విస్తృత అధికారాలను తనవద్దే అట్టిపెట్టుకున్న దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాత్రం పాలన కొనసాగిస్తున్నారు. సాయుధ దళాలు తన అధీనంలోనే పనిచేస్తుండడం ఆయనకు ఊరటనిచ్చే అంశం.


More Telugu News