ఆఫీసుకు రావాలన్నందుకు.. ఉద్యోగాన్నే వదిలేసిన ‘యాపిల్’ మెషీన్ లెర్నింగ్ డైరెక్టర్

  • పనిలో మరింత ఫ్లెక్సిబిలిటీ కావాలంటూ కామెంట్
  • ఇటీవల హైబ్రిడ్ వర్క్ కు యాపిల్ ఆదేశాలు
  • యాజమాన్యం నిర్ణయంపై ఇయాన్ అసంతృప్తి
  • ఉద్యోగులకు లేఖ రాసి పదవికి రాజీనామా
కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఉద్యోగులకు ఆఫర్ చేశాయి. అయితే, కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. టెక్నాలజీ, మొబైల్ ఫోన్ల దిగ్గజ సంస్థ యాపిల్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. హైబ్రిడ్ వర్క్ కు సంస్థ ఆదేశాలిచ్చింది. ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు సూచించింది. 

అయితే, అది నచ్చని ఓ ఉన్నతాధికారి ఉద్యోగాన్నే వదిలేశాడు. అవును, సంస్థ మెషీన్ లెర్నింగ్ విభాగ డైరెక్టర్ ఇయాన్ గుడ్ ఫెలో తన పదవికి రాజీనామా చేశారు. ఆఫీసుకు రావాలంటూ యాజమాన్యం ఆయనకు ఆదేశాలివ్వడంతో ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్టు సంస్థకు తెలియజేశారు. ఈ మేరకు సిబ్బందికి ఓ లేఖను విడుదల చేశారు. ఆఫీసుకొచ్చి పనిచేసే విషయంలో ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

కాగా, హైబ్రిడ్ వర్క్ కల్చర్ కు సంబంధించి యాపిల్ ఇటీవల ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. అందులో భాగంగా ఏప్రిల్ 11 నాటికి వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించింది. మే 2 నాటికి వారంలో రెండు రోజులు, మే 23 నాటికి కనీసం మూడు రోజులు ఆఫీసులో పనిచేసేందుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే, ఇయాన్ సహా చాలా మంది ఉద్యోగులు ఆ ఆర్డర్స్ పై విముఖత వ్యక్తం చేస్తూ, సంస్థ సీఈవో టిమ్ కుక్ కు లేఖ రాశారు. 

అందరికీ సౌలభ్యంగా ఉండేలా సమ్మిళిత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా కుటుంబం–వారి ఆరోగ్యమా? సంస్థా–ఉద్యోగమా? అని తేల్చుకునేలా హైబ్రిడ్ వర్క్ నిర్ణయం తీసుకున్నారని, ఈ రెంటిలో ఏది అవసరమన్నది తేల్చుకోవడం కష్టమేనని, తాము దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని స్పష్టం చేశారు. ఆఫీసుకు వచ్చి పనిచేసే విషయాన్ని మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News