భారీగా తగ్గనున్న ఇనుము ధరలు.. ఈ వానాకాలం నుంచే మొదలు: క్రిసిల్

  • ప్రస్తుతం టన్ను ఇనుము రూ.76 వేలు
  • రూ.60 వేలకు పడిపోనున్న ధర
  • వచ్చే ఏడాది మార్చి నాటికి తగ్గుదల
ఇంటి నిర్మాణంలో ఇనుము ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో సిమెంట్ తో పాటు ఇనుము ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే రోజుల్లో ఇనుము ధర భారీగా తగ్గుతుందని క్రిసిల్ వెల్లడించింది. దానికి సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం రూ.76 వేలుగా ఉన్న టన్ను ఇనుము ధర.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.60 వేలకు దిగి వస్తుందని పేర్కొంది.  

ప్రస్తుతం సప్లై చెయిన్ లో అంతరాయాలు, పర్యావరణ సంరక్షణ కోసం డీకార్బనైజేషన్ చర్యల్లో భాగంగా ధరలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ప్రత్యేకించి చైనాలో పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన భౌగోళి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి సామగ్రి ధరలు ఎక్కువయ్యాయని, దీంతో ఇనుము ధరలు పెరిగాయని వెల్లడించింది. 

అయితే, వానాకాలం నాటికి ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో నిర్మాణాలకు కొన్నాళ్లు బ్రేకులు పడే అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో దేశీయ పరిశ్రమలు దిగుమతులపై ఆధారపడే అవకాశం తగ్గుతుందని చెప్పింది. ఫలితంగా ధరలు కొంతమేర తగ్గుతాయని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ కౌస్తవ్ మజుందార్ చెప్పారు. 

తద్వారా వచ్చే ఏడాది మార్చి నాటికి ధరలు రూ.60 వేలకు పడతాయని తెలిపారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇనుము ధరల్లో పెరుగుదల 3 నుంచి 5 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రిపోర్ట్ అంచనా వేసింది.


More Telugu News