మరింత హింసాత్మకంగా మారిన శ్రీలంక.. ప్రతిపక్ష నేత ప్రేమదాసపై దాడి!

  • నానాటికీ దిగజారుతున్న శ్రీలంక పరిస్థితి
  • ప్రధాని రాజీనామా తర్వాత మరింత పెరిగిన హింస
  • ప్రేమదాసపై ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల దాడి
పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. రాజపక్స పూర్వీకులకు సంబంధించిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

మరోవైపు నిన్న ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలోకి వెళ్లిన ఎంపీ అమరకీర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళనకారులు దాడి చేశారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించేందుకు సజిత్ వచ్చారు. అప్పటికే అక్కడ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. 

ఈ క్రమంలో ప్రేమదాసపై ప్రభుత్వ అనుకూల వర్గీయులు దాడి చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గీయులు కూడా ఆయనపై దాడికి యత్నించడం గమనార్హం. ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విఫలమయ్యారంటూ వారు దాడికి యత్నించారు. దీంతో ఆయన చాలా దూరం పరిగెత్తి, కారెక్కి పారిపోయారు. శ్రీలంకలో పలు చోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రాకపోవడం గమనార్హం.


More Telugu News