మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై గ్రనేడ్ దాడి

  • రాకెట్ ఆధారిత గ్రనేడ్‌తో దాడి
  • డ్రోన్ ద్వారా ప్రయోగించిన ఇద్దరు అనుమానితులు
  • భవనం మూడో అంతస్తులో దెబ్బతిన్న కిటికీలు
  • ఉగ్రదాడి కాదన్న పోలీసులు
  • సమగ్ర నివేదిక కోరిన సీఎం భగవంత్ మాన్
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంపై నిన్న సాయంత్రం జరిగిన గ్రనేడ్ దాడి కలకలం రేపింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా ఈ రాకెట్ ఆధారిత గ్రనేడ్‌ను విసిరినట్టు తెలుస్తోంది. దాడితో అప్రమత్తమైన పోలీసులు పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. 

అయితే, ఇదేమీ ఉగ్రదాడి కాదని, పేలుడు మాత్రమేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దాడి కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్తులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

కాగా, కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత వ్యక్తులు రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్ (ఆర్పీజీ)ని 80 మీటర్ల దూరం నుంచి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇది లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా పేలుడు మాత్రం సంభవించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాకెట్ లాంచర్‌ను డ్రోన్ ద్వారా ప్రయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసేందుకు ఇటీవల డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News