అక్రమ కట్టడాల కూల్చివేతకు వ‌చ్చిన బుల్డోజ‌ర్లు.. ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ వద్ద తీవ్ర‌ ఉద్రిక్తత

  • బుల్డోజ‌ర్లు తీసుకురావ‌డంతో పెద్ద ఎత్తున అడ్డుకున్న‌ ప్ర‌జ‌లు
  • ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ ప్రాంతానికి వ‌చ్చిన ప‌లువురు నేత‌లు
  • షాహీన్ బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అక్క‌డి అక్రమ కట్టడాల కూల్చివేతకు దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్ సిబ్బంది బుల్డోజ‌ర్లు తీసుకురావ‌డంతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అడ్డుకుంటున్నారు. గ‌తంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వ‌హించి షాహీన్ బాగ్ వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. అదే ప్రాంతంలో అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం గమ‌నార్హం. 

ఈ ప్రాంతానికి నేడు బుల్డోజర్లను తీసుకురావ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో అధికారులు పారా మిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు. ఇటీవల జహంగీర్ పురి వద్ద కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు షాహీన్ బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేతల కోసం వేల సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

ఆందోళ‌నకారుల‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతున్నాయి. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన చేపట్టారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని త‌ర‌లించారు. ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఆందోళ‌న జ‌రుగుతోన్న ప్రాంతంలోనే ఉన్నారు.



More Telugu News