మద్యంలో కల్తీ జరిగింది సార్.. కిక్కెక్కడం లేదు: హోంమంత్రికి ఫిర్యాదు చేసిన మందుబాబు

  • నాలుగు క్వార్టర్ సీసాలు కొన్న మందుబాబు
  • రెండు సీసాలు తాగినా ఎక్కని కిక్కు
  • హోంమంత్రితోపాటు ఆబ్కారీ కమిషనర్‌కూ ఫిర్యాదు
  • వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేస్తానన్న మందుబాబు
తాను తాగిన మద్యంలో కల్తీ జరిగిందని, అస్సలు కిక్కివ్వడం లేదంటూ ఓ మందుబాబు ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. రెండు దశాబ్దాలుగా మద్యం తాగుతున్న తాను రుచి చూసి అది అసలుదో, నకిలీదో చెప్పేయగలనని పేర్కొన్నాడు. 

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని బహదూర్ గంజ్‌కు చెందిన లోకేశ్ సోథియా గత నెల 12న నాలుగు క్వార్టర్ సీసాలు కొన్నాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాలు లాగించేశాడు. అయినప్పటికీ కిక్కు ఎక్కకపోవడం, బాటిల్ మూత తీసినప్పుడు గుప్పుమని మద్యం వాసన రాకపోవడంతో కల్తీ జరిగినట్టు అనుమానించాడు. 

దీంతో మిగతా రెండు బాటిళ్లను అలాగే ఉంచి.. రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు, ఉజ్జయిని ఆబ్కారీ శాఖ కమిషనర్ ఇందర్‌సింగ్ దమోర్‌కు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన మద్యంలో కల్తీ జరిగిందని ఆరోపించాడు. 20 సంవత్సరాలుగా మద్యం తాగుతున్నానని, ఏది నకిలీదో, ఏది స్వచ్ఛమైనదో తనకు తెలుసని ఆ లేఖలో లోకేశ్ పేర్కొన్నాడు. అంతేకాదు, మద్యం కల్తీపై వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయనున్నట్టు లోకేశ్ న్యాయవాది నరేంద్రసింగ్ తెలిపారు.


More Telugu News