చెన్నై ఆల్‌రౌండ్ షో.. దారుణంగా ఓడిన ఢిల్లీ

  • ఢిల్లీపై 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన చెన్నై 
  • తొలుత బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో రాణించిన ధోనీ సేన
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా డెవోన్ కాన్వే
ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శివాలెత్తింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన చెన్నై ఆ తర్వాత బంతితోనూ విజృంభించి ఢిల్లీని బెంబేలెత్తించింది. డెవోన్ కాన్వే మరోమారు చెలరేగడంతో చెన్నై తొలుత ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఆ తర్వాత ఢిల్లీని 117 పరుగులకే పెవిలియన్ చేర్చి ఘన విజయాన్ని అందుకుంది. వికెట్ల వేటలో చెన్నై బౌలర్లు పోటీ పడ్డారు. మొయిన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా, ముకేశ్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, బ్రావో తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ చేసిన 25 పరుగులే అత్యధికం. వార్నర్ 19, కెప్టెన్ పంత్ 21, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. 

అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్ (41), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కాన్వే (49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87) వీరవిహారం చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గైక్వాడ్ అవుటైన తర్వాత వచ్చిన శివం దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, చివర్లో ధోనీ 8 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నార్జ్ 3, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి.


More Telugu News