బంగాళాఖాతంలో తుపానుగా మారిన వాయుగుండం... ఏపీపైనా ప్రభావం

  • తుపానుకు 'అసని'గా నామకరణం
  • పేరుపెట్టిన శ్రీలంక
  • 'అసని' ఉంటే ఉగ్రరూపం
  • ఎల్లుండి ఏపీ తీరానికి చేరువలో తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి 'అసని' అని నామకరణం చేశారు. ఇది మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అసని తుపాను ప్రభావం ఏపీపైనా ఉంటుందని, ఈ నెల 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. 

అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. 

కాగా, అసని తుపాను ప్రస్తుతం కార్ నికోబార్ దీవులకు పశ్చిమ వాయవ్యంగా 530 కిమీ దూరంలో, పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమంగా 440 కిమీ దూరంలో, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 900 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతోందని తాజా బులెటిన్ లో పేర్కొంది. 

ఈ తుపానుకు 'అసని' అని నామకరణం చేసిన దేశం... శ్రీలంక. శ్రీలంక భాష సింహళంలో 'అసని' అంటే 'ఉగ్రరూపం' అని అర్థం.


More Telugu News