ఢిల్లీ జట్టులో మరోసారి కరోనా కలకలం.. నెట్ బౌలర్ కు పాజిటివ్

  • హోటల్ గదుల్లోనే ఉండాలంటూ సూచనలు
  • అందరి నుంచి నమూనాలు సేకరణ
  • టెస్ట్ ఫలితాల తర్వాత మ్యాచ్ పై నిర్ణయం
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు నెట్ బౌలర్ (నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బౌలింగ్ వేసే వ్యక్తి) ఒకరికి కరోనా పాజిటివ్ గా బయటపడింది. దీంతో హోటల్ గదుల్లోనే ఉండిపోవాలంటూ ఆటగాళ్లు అందరికీ సూచనలు వెళ్లాయి. దీంతో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? అన్న సందేహం నెలకొంది.

ఆదివారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లు అందరి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితాల తర్వాత మ్యాచ్ పై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడం ఇదే మొదటిసారి కాదు. ఫిజియో ప్యాట్రిక్ ఫార్ హార్ట్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ సహా ఆరుగురు లోగడ కరోనాతో ఐసోలేషన్ కు వెళ్లిన వారే. నేటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కేకు 11వది అవుతుంది. ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి ఇకపై ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. టెస్ట్ ఫలితాల తర్వాత నెగెటివ్ వచ్చిన వారిని మ్యాచ్ కు అనుమతించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.


More Telugu News