వార్నర్ డ్రెస్సింగ్ రూములో గొడవలు పడతాడు: వీరేంద్ర సెహ్వాగ్

  • వార్నర్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కంటే పార్టీలే ఎక్కువ
  • చివరి రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టాం
  • కొందరికి గుణపాఠం చెప్పాలంటే ఇలా చేయడం తప్పదు మరి
  • గుర్తు చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు. వార్నర్ అంత మంచోడేమీ కాదని, డ్రెస్సింగ్ రూములో తరచూ గొడవలు పడుతుంటాడని చెప్పుకొచ్చాడు. అతడిలో క్రమశిక్షణ లేదని అన్నాడు. 2009లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్ ఈ సందర్భంగా నాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. వార్నర్ డ్రెస్సింగ్ రూములో గొడవలు పడేవాడని, అతడిని నియంత్రించడం కష్టమైందని పేర్కొన్నాడు.

అప్పట్లో తాను కొందరు ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేశానని, అందులో వార్నర్ కూడా ఉన్నాడని వివరించాడు. జట్టులో చేరిన కొత్తలో వార్నర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు మానేసి పార్టీల్లో మునిగి తేలేవాడని అన్నాడు. వార్నర్ ఇద్దరు ఆటగాళ్లతో గొడవ పడడంతో చివరి రెండు మ్యాచుల్లో ఆడకుండా అతడిని ఇంటికి పంపించామని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. కొందరికి గుణపాఠం నేర్పాలంటే కొన్నిసార్లు పక్కన పెట్టకతప్పదని అన్నాడు. అలా చేస్తేనే జట్టులో అందరూ ముఖ్యమనే సందేశం వెళ్తుందని పేర్కొన్నాడు. వార్నర్‌ను దూరం పెట్టాక కూడా తాము గెలిచినట్టు సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

గురువారం ఢిల్లీ కేపిట్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌కు ముందు వార్నర్ విషయం ప్రస్తావనకు వచ్చింది. 2016లో హైదరాబాద్‌కు టైటిల్ అందించడంతో పాటు సంవత్సరాలుగా వార్నర్ జట్టుకు సేవలు అందించాడు. అయితే, గతేడాది వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇది వివాదాస్పదమైంది కూడా. ఆ తర్వాత అతడిని జట్టు వదిలేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో ఢిల్లీ అతడిని రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ  సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న వార్నర్ నాలుగు అర్ధ సెంచరీలతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


More Telugu News