తగ్గేదేలే! మూడు రోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా

  • దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు ప్రయోగం
  • నిర్ధారిస్తున్న ఉపగ్రహ చిత్రాలు
  • ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరిక
ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పక్కనపెట్టి క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తరకొరియా తాజాగా నిన్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్‌బీఎం)ని పరీక్షించింది. ఇది ఓ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. తన ప్రధాన నౌకాదళ స్థావరమైన సిన్‌పో సమీపంలో దీనిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. గత మూడు రోజుల్లో ఇది రెండో క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ప్రయోగం చేపట్టడం చర్చకు దారితీసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా నిర్ధారించింది. సిన్‌పోలో జలాంతర్గాములు ఉన్నట్టు నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగినట్టు నిర్ధారించింది.

మరోవైపు, అణు పరీక్షలకు కిమ్ సిద్ధమవుతున్నట్టు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. అణు పరీక్ష కోసం నార్త్ కొరియా ‘పుంగే-రి’ టెస్ట్ సైట్‌ను సిద్ధం చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం చేయనుండడం, అమెరికా అధ్యక్షుడు ఈ నెలాఖరులో జపాన్, దక్షిణ కొరియాలలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని భావిస్తున్నారు.


More Telugu News