అప్పుడు స‌చిన్ 194 ప‌రుగుల‌తో క్రీజులో ఉండ‌గా ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశారు: యువ‌రాజ్ సింగ్

  • 2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టు మ్యాచ్ గురించి యువీ స్పంద‌న‌
  • స‌చిన్ డ‌బుల్ సెంచరీ చేశాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే బాగుండేద‌న్న మాజీ క్రికెట‌ర్
  • ఆ స‌మ‌యంలో జట్టు స‌రైన నిర్ణ‌యం తీసుకోలేద‌ని వ్యాఖ్య‌
టీమిండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్‌... 2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టు మ్యాచ్ గురించి స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆ టెస్టులో స‌చిన్ టెండూల్క‌ర్ 194 ప‌రుగుల‌తో క్రీజులో ఉండ‌గా, ఇన్నింగ్స్‌ ను డిక్లేర్ చేశార‌ని, స‌చిన్ డ‌బుల్ సెంచరీ చేశాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసివుంటే బాగుండేద‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో జట్టు స‌రైన నిర్ణ‌యం తీసుకోలేద‌ని విమర్శించాడు.  

ఆ రోజు తాను, సచిన్ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తున్నామ‌ని, అయితే, ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తున్నామని వేగంగా పరుగులు చేయాలని జట్టు నుంచి సందేశం వచ్చిందని తెలిపాడు. ఆ స‌మ‌యంలో సచిన్ కేవ‌లం మ‌రో ఓవర్‌ ఆడి ఉంటే మ‌రో ఆరు పరుగులూ చేసి డ‌బుల్ సెంచ‌రీ సాధించేవాడ‌ని అన్నాడు. 

ఆ మ్యాచు మ‌రో రెండు ఓవర్లు ఆడి ఉంటే అది మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపేది కాదని తాను భావిస్తున్న‌ట్లు తెలిపాడు. కాగా, అప్ప‌టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 675/5 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆ మ్యాచులో వీరేందర్‌ సెహ్వాగ్ 309 ప‌రుగులు చేసి, త్రిశతకం సాధించి ఆ ఘ‌న‌త సాధించిన‌ భారత టెస్టు తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు. 

ఆ మ్యాచులో సచిన్‌ టెండూల్క‌ర్ 194 ప‌రుగుల‌తో క్రీజులో ఉండ‌గా, అప్ప‌టి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 407 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 52 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది.


More Telugu News