బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్

  • పొట్టి క్రికెట్లో ఎకానమీ కూడా కీలకమేనన్న రషీద్ 
  • వికెట్లు తీయాలన్న ఒత్తిడి దూరమవుతుందని వ్యాఖ్య 
  • నేర్చుకోెవాల్సింది ఎంతో ఉంటుందని వివరణ  
పొట్టి క్రికెట్లో వికెట్లు తీయడమే ముఖ్యం కాదని.. పరుగులు పారకుండా చూడడం కూడా కీలకమేనని గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. వికెట్లు ఎక్కువ తీయలేకపోయానన్న ఒత్తిడి తనపై ఉండదన్నాడు. తాను బౌలింగ్ చేసే సమయంలో బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తానని చెప్పాడు.

ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 2022 ఐపీఎల్ సీజన్ లో కేవలం 11 వికెట్లే తీశాడు. ‘‘టీ20ల్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎకానమీ (పరుగులు ఎక్కువ చేయకుండా)పై దృష్టి పెట్టాలి. అది బ్యాటింగ్ చేస్తున్న వారిపై ఒత్తిడి పెంచుతుంది’’ అని ముంబై చేతిలో ఓటమి అనంతరం మీడియాతో అన్నాడు.

నిజంగా ఇతర ఐపీఎల్ సీజన్ లతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ వికెట్లే తాను సాధించినట్టు రషీద్ ఖాన్ అంగీకరించాడు. కొన్ని మ్యాచుల్లో తాను గొప్పగా బౌలింగ్ చేయలేదన్నాడు. టీ20ల్లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని చెప్పాడు. గత మ్యాచుల్లో తాము చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ముంబైతో మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా, తెవాతియా రనవుట్ అవ్వడం ఫలితాన్ని మార్చేసినట్టు పేర్కొన్నాడు.


More Telugu News