ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలును అడ్డుకోండి.. కోర్టుకెక్కిన ఇన్వెస్టర్

  • 2025 వరకు కొనుగోలును అడ్డుకోవాలి
  • మస్క్ రెండొంతుల వాటాదారుల ఆమోదం పొందాల్సిందే
  • డెలావేర్ కోర్టులో పిటిషన్ దాఖలు
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్.. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు, ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ కోర్టును ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ట్విట్టర్ లో వీరు ఇరువురికీ వాటాలుండడం గమనార్హం.  

మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలాన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది.


More Telugu News