కాంగ్రెస్ వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌కు కౌంట‌రిచ్చిన తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

  • తెలంగాణ ఇచ్చిన‌ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లెందుకు తిరస్క‌రించారన్న నిరంజన్ రెడ్డి 
  • పదేండ్ల తాత్సారంతోనే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుందని వ్యాఖ్య 
  • పెట్టుబ‌డి సాయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు చేయమని సలహా 
  • ఇందిరమ్మ ఇళ్ల భాగోతం సీబీసీఐడీ విచారణలో తేలిపోయింద‌న్న మంత్రి
కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్ వేదిక‌గా నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ వేదిక‌గా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుద‌ల చేసిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌పై టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మితే 2014, 2018లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు ఎందుకు ఓడించారని ఈ సంద‌ర్భంగా ఆయన కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీశారు.

ఇచ్చుడు, తీసుకునుడు లేదిక్కడ అని చెప్పిన ఆయ‌న‌.. ఎనలేని త్యాగాలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని చెప్పారు. 2004లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా రాష్ట్రపతి నోటి నుండి తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రకటించి పదేండ్లు తాత్సారం చేసిన ఫ‌లితంగానే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకున్నదని ఆయ‌న తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన‌ ఇందిరమ్మ ఇళ్ల భాగోతం సీబీసీఐడీ విచారణలో తేలిపోయింద‌న్న మంత్రి.. కట్టని ఇండ్లకు బిల్లులు ఎత్తిన మాయాజాలం కాంగ్రెస్‌ద‌ని విమ‌ర్శించారు.

2018 ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేసిన సింగిరెడ్డి .. అయినా రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని తిరస్కరించార‌న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే పాత పాట పాడుతున్నదని ఆయ‌న ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం రూ.15 వేలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ నేత‌లు.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని వెంటనే అమలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతులకు స‌రైన‌ ధర నిర్ణయం కోసం నిర్దేశించిన స్వామినాధన్ కమీషన్ వేసింది యూపీఏ ప్రభుత్వమేన‌ని, ఆ కమిటీ సిఫారసులు ఎగ్గొట్టింది కూడా యూపీఏ ప్రభుత్వమేన‌ని మంత్రి ధ్వ‌జ‌మెత్తారు.


More Telugu News