సింహం సింగిల్ గానే వస్తుంది!... చంద్ర‌బాబు పొత్తు వ్యాఖ్య‌ల‌పై మంత్రి జోగి ర‌మేశ్ వ్యాఖ్య‌

  • వైసీపీ ఒక వైపు.. మిగిలిన పార్టీల‌న్నీ మ‌రోవైపు
  • అధికారం కోస‌మే చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆరాటం
  • చంద్ర‌బాబు ఒక్క‌రే జ‌గ‌న్‌ను ఢీకొట్ట‌లేరు
  • జ‌గ‌న్‌తో పోటీ ప‌డే స‌త్తా ప‌వ‌న్‌కు లేదు
  • ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అన్న‌దే లేదన్న జోగి రమేశ్‌
2024 ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై వ‌రుస‌బెట్టి వైసీపీ నేత‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి జోగి ర‌మేశ్... చంద్ర‌బాబు పొత్తు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. సింహం సింగిల్ గానే వస్తుందంటూ త‌మ పార్టీ ఒంట‌రి పోరును ఆయ‌న ప్ర‌క‌టించేశారు. వైసీపీ ఒక వైపు.. మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు అంటూ ర‌మేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  చంద్రబాబు, సొంతపుత్రుడు, దత్తపుత్రుడు అందరూ కలగూరగంపలా కలిసొచ్చినా త‌మ‌ను ఏమీ చేయలేరని జోగి ర‌మేశ్ చెప్పారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేదే లేదన్న ర‌మేశ్‌... అస‌లు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఓటేసే వారు ఎవ‌రున్నారంటూ ప్ర‌శ్నించారు. 45 లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? అని ప్ర‌శ్నించిన ర‌మేశ్‌.. 60 లక్షల మందికి రైతుభరోసా కల్పిస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? అని విపక్షాల‌ను నిల‌దీశారు. 26 లక్షల మందికి చేయూత ఇస్తున్నందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? అన్న ఆయ‌న‌... 85 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నందుకు ఉంటుందా? అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒకటో తేదీన పింఛన్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నందుకు త‌మపై వ్య‌తిరేక‌త ఉంటుందా? ఆని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

రాష్ట్ర ప్రజలందరూ త‌మ‌ నాయకుడు జగన్ వెంటే ఉన్నారని జోగి ర‌మేశ్ ప్ర‌క‌టించారు. అధికారం కోసమే బాబు, పవన్ ఆరాటప‌డుతున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు ఒక్కడే రాలేడని, జగన్‌ను ఢీకొట్టలేడని కూడా ర‌మేశ్ వ్యాఖ్యానించారు. ఇక జ‌న‌సేనాని పవన్ క‌ల్యాణ్‌కు సీఎం జగన్‌తో పోటీ పడే సత్తా అసలే లేదన్న మంత్రి ర‌మేశ్‌... చంద్ర‌బాబు, పవన్‌లు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.


More Telugu News