కీలక మ్యాచ్‌లో చెలరేగిన ఢిల్లీ కేపిటల్స్.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన హైదరాబాద్

  • సన్‌రైజర్స్‌ను కిందికి నెట్టేసి ఐదో స్థానానికి ఢిల్లీ కేపిటల్స్
  • పూరన్ విరుచుకుపడినా హైదరాబాద్‌కు దక్కని ఫలితం
  • డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చెలరేగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఐదు వరుస విజయాలతో అదరగొట్టిన హైదరాబాద్‌ హ్యాట్రిక్ ఓటములతో ఢిల్లీ తర్వాతి స్థానానికి పడిపోయింది. కేపిటల్స్ నిర్దేశించిన 208 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విలియమ్సన్ సేనకు ప్రారంభంలోనే షాకులు తగిలాయి. 

8 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (7), 24 పరుగుల వద్ద విలియమ్సన్ (4) అవుటయ్యారు. రాహుల్ త్రిపాఠి (22), మార్కరమ్ (42) కాసేపు క్రీజులో కుదురుకున్నా భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. నికోలస్ పూరన్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 62) విరుచుకుపడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే, అతడు అవుటయ్యాక క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టుగా పెవిలియన్ చేరడంతో ఎస్ఆర్‌హెచ్ పరాజయం ఖాయమైంది. 

సీన్ అబాట్, కార్తీక్ త్యాగి ఏడేసి పరుగుల చొప్పున చేయగా, శ్రేయాస్ గోపాల్ (9), భువనేశ్వర్ కుమార్ (5) నాటౌట్‌గా నిలిచారు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన హైదరాబాద్ విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌కు 3, శార్దూల్ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 92 పరుగులు చేయగా, రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో అజేయంగా 67 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 10, పంత్ 26 పరుగులు చేయగా, మన్‌దీప్ డకౌట్ అయ్యాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లోనే గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య ముంబైలో మ్యాచ్ జరగనుంది.


More Telugu News