తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌... ఈ నెల 30న పోలింగ్‌

  • ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటు
  • 12న విడుద‌ల కానున్న ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌
  • 19 దాకా నామినేష‌న్ల‌కు గ‌డువు
  • 30న పోలింగ్‌.. అదే రోజు ఫ‌లితం వెల్ల‌డి
తెలంగాణ‌లో ఇటీవ‌లే ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 12న ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి ఈ నెల 19 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు గడువు ఉంది. ఆ త‌ర్వాత ఈ నెల 30న ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా... అదే రోజు ఓట్లలెక్కింపును నిర్వహించి విజేత‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. 

తెలంగాణ నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున 2018లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన‌ బండ ప్రకాశ్ ఇటీవ‌లే తెలంగాణ శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్సీగా మారిన బండ ప్ర‌కాశ్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలోనే ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానానికి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నుంది.


More Telugu News