కేసులకు భయపడవద్దు... ఎన్ని కేసులుంటే అంత భవిష్యత్తు: పార్టీ శ్రేణులతో చంద్రబాబు

  • విశాఖలో చంద్రబాబు పర్యటన
  • జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశం
  • పార్టీ కోసం పనిచేసేవాళ్లకే అవకాశాలు అని వెల్లడి
  • కేసుల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని భరోసా
విశాఖ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం నేతలు, కార్యకర్తల పనితీరు, సేవల ఆధారంగానే భవిష్యత్తులో వారికి అవకాశాలు ఇస్తామని తెలిపారు. పార్టీ కోసం ఆర్థికంగా సాయపడేవాళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వారికి మెరుగైన అవకాశాలు ఉంటాయని అన్నారు. 

"జగన్ వచ్చాక రాష్ట్రం దివాలా తీసింది. జగన్ ఓ ఐర్ లెగ్. కోడికత్తి వంటి డ్రామాలు మనం చేయలేదు... మనకు ఆ అవసరం కూడా లేదు. జగన్ ఊరికొక సైకోను తయారు చేశారు. ఇలాంటి పొలిటికల్ సైకోలను అణచివేసే బాధ్యత మనకుంది... ఆ శక్తి కూడా మనకుంది. 

ఇక, కేసుల గురించి నేతలు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దు. ఎంత ఎక్కువగా కేసులు ఉంటే అంత భవిష్యత్తు. ఈ కేసుల కోసం ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, అన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాదే" అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

పనిచేసేవాళ్లకు, ప్రజలతో నిత్యం మమేకయ్యే వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీలో ప్రజలకు అత్యధిక భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోరాడాలని, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ గెలుపు ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News