మీడియా నా గొంతు నొక్కేస్తోంది.. జోక్యం చేసుకోండి: అమిత్ షాకు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విజ్ఞప్తి

  • మీడియా సమావేశానికి వేదిక ఇచ్చేందుకు ఎఫ్‌సీసీ, పీసీఐ నిరాకరణ
  • ఫైవ్‌స్టార్ హోటల్‌కు మార్చుకున్న అగ్నిహోత్రి
  • వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన వారే తన గొంతు నొక్కుతున్నారని వివేక్ ఆవేదన
  • తాను దుష్ప్రచార బాధితుడినన్న దర్శకుడు
  • వివేక్ వ్యాఖ్యలపై పీసీఐ ఆగ్రహం
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తన గొంతును నొక్కేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. 

అగ్నిహోత్రి నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందుకు వేదిక ఇచ్చేందుకు ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (ఎఫ్‌సీసీ), ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిరాకరించాయి. దీంతో ఆయన తన వేదికను ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు మార్చుకోవాల్సి వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ.. సమాజంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాపాడాల్సిన వారే, తన గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిషేధం అప్రజాస్వామికమని, ఈ విషయంలో అమిత్ షా కలగజేసుకోవాలని కోరారు. తాను దుష్ప్రచార బాధితుడినని అన్నారు. 

అయితే, ఆయన వ్యాఖ్యలను పీసీఐ ఖండించింది. నిబంధనల ప్రకారం నమోదు చేసుకోకుండా వేదికను ఇమ్మంటే ఎలా? అని ప్రశ్నించింది. ఆయన మాటలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఎఫ్‌సీసీ దక్షిణాసియా అధ్యక్షుడు మనీశ్ గుప్తా కూడా దీనిపై స్పందించారు. ఆ ప్రచార కార్యక్రమాన్ని తాము రద్దు చేయాలనుకున్నామని, ఈ విషయంలో ఇంకేం మాట్లాడబోమని స్పష్టం చేశారు.


More Telugu News