రెపో రేటు పెంచిన ఆర్బీఐ... భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • రెపో రేటు 40 పాయింట్ల మేర పెంపు 
  • తాజా పెంపుద‌ల‌తో 4.40కి చేరిన రెపో రేటు
  • పెంచిన రెపో రేటు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి
  • ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ఆర్బీఐ నిర్ణ‌యం
దేశంలో అంత‌క‌కంత‌కూ పెరిగిపోతున్న‌ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసే క్ర‌మంలో భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటును 40 బేసిక్ పాయింట్ల మేర పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బ‌ణం పెరుగుతుండ‌టం, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో తాజా ప‌రిస్థితిపై స‌మీక్షించేందుకు ఆర్బీఐ అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యింది. 

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ నేతృత్వంలో జ‌రిగిన ఈ భేటీలో రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజా పెంపుద‌ల‌తో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక పెంచిన రెపో రేటు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వస్తుంద‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది.

రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ద‌రిమిలా దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం 1,120 పాయంట్ల మేర త‌గ్గిన సెన్సెక్స్ 55,849 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అదే స‌మ‌యంలో 345 పాయింట్ల మేర దిగ‌జారిన నిఫ్టీ 16,721 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.


More Telugu News