ట్విట్టర్ వాడితే చార్జీ.. అదీ కొద్ది మందికే.. స్పష్టతనిచ్చిన మస్క్
- వాణిజ్య వినియోగానికి చార్జీ
- ప్రభుత్వాలకు కూడా
- సాధారణ యూజర్లకు చార్జీలు ఉండవు
- ప్రకటించిన ఎలాన్ మస్క్
ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్ను ట్విట్టర్ పై ఎందుకు పడిందబ్బా..? చాలా మందికి ఈ సందేహం వచ్చింది. తాజా ప్రకటనతో ఎలాన్ మస్క్ వీటికి తెరదించారు. ఇప్పటి వరకు ట్విట్టర్ యూజర్ల నుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయడం లేదు. కేవలం ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంతోనే నెట్టుకొస్తోంది. మరింత మంది యూజర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది.
దీన్ని బంగారు బాతులా చూశాడు ఎలాన్ మస్క్. అందుకే 44 బిలియన్ డాలర్లతో కొనుగోలుకు డీల్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు తన అసలు ప్లాన్ ను బయటపెట్టాడు. ట్విట్టర్ సేవలను వినియోగించుకున్నందుకు కొన్ని వర్గాల నుంచి చార్జీ వసూలు చేయనున్నట్టు మస్క్ తాజాగా ప్రకటించాడు. సాధారణ యూజర్లకు చార్జీ ఉండదని.. వాణిజ్యపరమైన వినియోగం, ప్రభుత్వాల నుంచి చార్జీ వసూలు చేయనున్నట్టు మస్క్ స్వయంగా ప్రకటించాడు.
ట్విట్టర్ ను సాంకేతికంగా మరింత బలంగా, వినూత్నంగా మారుస్తానని మస్క్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే వేదికగా దీన్ని మార్చాలన్నదే తన ఆశయమని ఆయన పేర్కొన్నాడు.