లౌడ్ స్పీకర్లపై బాల్ థాకరే హెచ్చరికతో కూడిన పాత వీడియోను విడుదల చేసిన రాజ్ థాకరే!

  • తాము అధికారంలోకి వస్తే లౌడ్ స్పీకర్లు తొలగిస్తామన్న బాల్ థాకరే 
  • రోడ్లపై  నమాజ్ చేయడానికి వీల్లేదని హెచ్చరించిన థాకరే 
  • అభివృద్ధికి ఏ మతం అడ్డు రాకూడదని వ్యాఖ్య 
  • వెలుగులోకి బాల్ థాకరే ప్రసంగ వీడియో
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపారు. మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ ఆయన మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయినా సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు.

ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్లను వ్యతిరేకిస్తూ కొన్నేళ్ల క్రితం బాల్ థాకరే చేసిన ప్రసంగ వీడియో క్లిప్ ను రాజ్ థాకరే విడుదల చేశారు. తద్వారా బాల్ థాకరే కుమారుడు, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను ఇరకాటంలో పడేశారు.

36 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో బాల్ థాకరే ప్రసంగాన్ని వింటే.. లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఆయన హెచ్చరించడం వినిపిస్తుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లపై నమాజ్ చేయడాన్ని అడ్డుకుంటామని అందులో ఆయన పేర్కొన్నారు. 

‘‘ఏ అభివృద్ధికి మతం అడ్డుగా నిలవకూడదు. అభివృద్ధికి ఏవైనా హిందూ ఆచారాలు అడ్డుపడినా వాటి పట్ల కూడా ఇలానే స్పందిస్తాం. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగిస్తాం’’ అని బాల్ థాకరే నాటి వీడియోలో ప్రకటించారు. 

మే 3 నాటికి మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని రెట్టింపు శబ్దంతో వినిపిస్తామని రాజ్ థాకరే లోగడ ప్రకటించారు. హిందువులు అందరూ ఇదే పనిచేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

అయితే, లౌడ్ స్పీకర్లపై రాజ్ థాకరే చేస్తున్న ఉద్యమానికి మహారాష్ట్ర సర్కారు నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. పైగా ఆయన చర్యను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. దీంతో శివసేన వ్యవస్థాపకుడి మార్గాన్ని సర్కారుకు రాజ్ థాకరే గుర్తు చేశారు. బాల్ థాకరే తమ్ముడి కుమారుడే రాజ్ థాకరే.


More Telugu News