రంజాన్ సందర్భంగా సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు

  • సరిహద్దులోన్లూ ఈద్-ఉల్-ఫితర్ స్ఫూర్తి
  • పలు సెక్టార్లలో స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న జవాన్లు
  • శాంతి స్థాపనకు ఎప్పుడూ ముందుంటామన్న బీఎస్ఎఫ్
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎంతటి ఉద్రిక్త పూరిత వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, రంజాన్ సందర్భంగా భిన్నమైన పరిస్థితి కనిపించింది. భారత సరిహద్దు భదత్రా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు, పాకిస్థాన్ రేంజర్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సాంబా, కథువా, ఆర్ఎస్ పురా, అర్నియా, సుచేత్ గఢ్, రాంగఢ్, కనాచక్, అక్నూర్ సెక్టార్ల వద్ద ఇరుదేశాల జవాన్లు సుహృద్భావ పూరిత వాతావరణంలో రంజాన్ స్ఫూర్తిని ప్రతిబింబించారు. 

దీనిపై బీఎస్ఎఫ్ స్పందిస్తూ, సరిహద్దుల్లో శాంతియుత, సౌహార్ద్ర వాతావరణం నెలకొల్పేందుకు బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొంది. ఇలాంటి చర్యల ద్వారా ఇరు దేశాల బలగాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అటు, బంగ్లాదేశ్ జవాన్లతోనూ బీఎస్ఎఫ్ జవాన్లు ఇదే రీతిలో మిఠాయిలు పంచుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను బీఎస్ఎఫ్ సోషల్ మీడియాలో పంచుకుంది.
.


More Telugu News