బండ్ల గణేష్ హీరోగా నటించిన "డేగల బాబ్జీ' మే 20 న విడుదల

  • సినిమా మొత్తం కనిపించేది ఒక పాత్రే
  • మిగతా పాత్రలకు వాయిస్ మాత్రమే!
  • వెంకట్ చంద్ర దర్శకత్వంలో చిత్రం
  • తమిళ చిత్రానికి తెలుగులో రీమేక్
తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ. ఒకే చోట, సింగిల్ లొకేషన్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా... వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7" చిత్రాన్ని తెలుగులో డేగల బాబ్జీగా రీమేక్ చేశారు. ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. 

వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, మే 20 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హీరో బండ్ల గణేష్ మాట్లాడుతూ... ఒక రూమ్ లో రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్ అని వెల్లడించారు. అలాంటి కథతో దర్శకుడు వెంకట్ చంద్ర తనను హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడని తెలిపారు. 

"ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది. ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబర్చి నేషనల్ అవార్డు సాధించిన "ఉత్త సిరుప్పు సైజు  7" సినిమాను తెలుగులో నేను చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి, హరీష్ శంకర్  గారికి ధన్యవాదాలు. మే 20 న వస్తున్న ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను" అన్నారు. 

దర్శకుడు వెంకట్ చంద్ర మాట్లాడుతూ... బండ్ల గణేష్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చాడని కితాబునిచ్చారు. సినిమా విడుదలైన తరువాత బండ్ల గణేష్ ఇంత బాగా నటించగలుగుతాడా అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారని అన్నారు. లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని.... మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరి ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు.


More Telugu News