కోర్టుల్లో తీర్పులు కూడా ఇంగ్లీషులోనే ఉంటున్నప్పుడు తమిళులు హిందీ ఎందుకు మాట్లాడాలి?: సోను నిగమ్

  • మళ్లీ రాజుకున్న హిందీ భాషా వివాదం
  • ఇటీవల అజయ్ దేవగణ్, కిచ్చ సుదీప్ మధ్య ట్వీట్ల యుద్ధం
  • ఓ చర్చ కార్యక్రమంలో సోను నిగమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలోనే లేదని వెల్లడి
సుదీర్ఘకాలంగా ఉన్న హిందీ భాషా వివాదం ఇటీవల వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన వ్యక్తుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ స్పందించారు.  దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, హిందీయేతర ప్రజలపై ఆ భాషను బలవంతంగా రుద్దలేరని అభిప్రాయపడ్డారు. 

"నాకు తెలిసినంత వరకు హిందీ జాతీయ భాష అని భారత రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. దీనిపై నేను నిపుణులను కూడా సంప్రదించాను. అయితే ఎక్కువగా చలామణీలో ఉన్న భాష మాత్రం హిందీనే. అంతవరకు ఓకే. కానీ తమిళం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అని తెలుసా?... సంస్కృతం, తమిళ భాషల్లో ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష ఏదన్న దానిపై చర్చ కూడా నడుస్తోంది. ప్రజలు తమిళమే ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాష అంటున్నారు. ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో దేశం సతమతమవుతుంటే, ఇప్పుడీ భాషా వివాదం ఒకటి... అవాంఛనీయ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. 

ఇతరులపై బలవంతంగా ఓ భాషను రుద్దుతూ దేశంలో సమగ్రతను దెబ్బతీస్తున్నాం. నువ్వు తమిళుడవి అంటూనే హిందీ మాట్లాడాలంటున్నాం. వాళ్లెందుకు హిందీ మాట్లాడాలి? తాము ఏ భాషలో మాట్లాడాలన్న హక్కు ప్రజలకు ఉండాలి" అని సోను నిగమ్ స్పష్టం చేశారు. బీస్ట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, సీఈవో సుశాంత్ మెహతాతో చర్చ కార్యక్రమం సందర్భంగా సోను నిగమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 "ఓ పంజాబీ వ్యక్తి పంజాబీ భాషలో మాట్లాడతాడు. అలాంటప్పుడు తమిళుడు తమిళంలోనే మాట్లాడతాడు. ఒకవేళ వారికి ఆంగ్లంలో సౌకర్యవంతంగా ఉంటే ఆ భాషలోనే మాట్లాడతారు. ఇప్పటికీ మన న్యాయస్థానాల్లో తీర్పులు ఇంగ్లీషులోనే వెలువరిస్తున్నారు. అలాంటప్పుడు తమిళులను హిందీలో మాట్లాడాలని బలవంతం చేయడం సరికాదు" అని హితవు పలికారు. 

సోను నిగమ్ 32 భాషల్లో పాటలు పాడారు. పలు దక్షిణాది చిత్రాల్లోనూ ఆయన గీతాలు ఆలపించారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ హీరో కిచ్చ సుదీప్ మధ్య వాడివేడిగా హిందీ భాషపై ట్వీట్ల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ కు చెందిన సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


More Telugu News