రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు

  • ఈ నెల 6న తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ
  • ఓయూలో పర్యటనకు అనుమతి నిరాకరణ
  • రాహుల్, రేవంత్ లపై ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది
  • ఫిర్యాదుపై విచారణ చేయనున్న ఎన్ హెచ్ఆర్సీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. వారిద్దరిపై హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తాజా పరిణామాలు ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ న్యాయవాది రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదును స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు చేయనుంది. 

ఈ నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 7న ఆయన ఓయూ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, వర్సిటీ పాలక మండలి నుంచి అనుమతి లభించలేదు. దాంతో కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. నిరసనలు తెలిపిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, విద్యార్థి సంఘం నేతలను జైలుకు వెళ్లి పలకరించాలని రాహుల్ భావిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఇప్పటికే జైలు అధికారులకు విజ్ఞాపన పత్రం అందజేశారు.


More Telugu News