స్మితా సబర్వాల్ కు షాకిచ్చిన హైకోర్టు.. రూ. 15 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశం!

  • 2015లో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన స్మిత
  • 'నో బోరింగ్ బాబు' అనే కథనాన్ని ప్రచురించిన అవుట్ లుక్
  • పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వ నిధులు వాడుకున్న స్మిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మును వాడుకోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వివరాల్లోకి వెళ్తే 2015 జూన్ లో హైదరాబాదులోని ఓ ఫ్యాషన్ షోలో తన భర్తతో కలిసి స్మితా సబర్వాల్ ర్యాంప్ వాక్ చేశారు. 

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2015 జులైలో 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికన అవుట్ లుక్ పత్రిక ఓ వ్యాసాన్ని, క్యారికేచర్ ను ప్రచురించింది. ఈ కథనం తన పరువుకు నష్టం కలిగించేలా ఉందంటూ రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు నిధులు విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ క్రమంలో కేసు దాఖలు చేసేందుకు, కోర్టు ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ. 15 లక్షలు విడుదల చేసింది. అయితే ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ నిధులను వాడుకోవడంపై మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన ధర్మాసనం... అధికారుల విధుల్లో భాగంగా వివాదాలు తలెత్తినప్పుడు మాత్రమే ప్రభుత్వం సహాయం చేయాలని స్పష్టం చేసింది. రూ. 15 లక్షలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని స్మితా సభర్వాల్ కు ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని... లేని పక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే ఆమె నుంచి రికవరీ చేయాలని ఆదేశించింది.


More Telugu News